మంత్రి సీతక్క చొరవతో రూ.10 వేల తక్షణ సహాయం
మంగపేట, నవంబర్ 18 (తెలంగాణ వాణి): ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటనలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ప్రమాద విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు ఇందారపు చెంచులక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు ఫోన్ ద్వారా ప్రమాద వివరాలను తెలియజేయగా, ఆమె బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. తక్షణ అవసరాల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయ్యోరి యానయ్య, దేవస్థానాల డైరెక్టర్ పూజారి సురేందర్, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ యర్రంగారి సురేష్, మండల నాయకులు కొంకతి సాంబశివరావు, చందర్లపాటి శ్రీనివాస్ రావు, తుడి భగవాన్ రెడ్డి, ఇందారపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.





