ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సంక్షేమ పథకాలు ఆగవు
58వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ దావూద్
కొత్తగూడెం, (సూర్యోదయ వార్త) పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 58వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ దావూద్ అన్నారు. ప్రభుత్వ పథకాలపై ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అర్హులైన పేదలకు అందించే సంక్షేమ సాయం ఆగదని పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, 58వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ దావూద్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ దావూద్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పేదలకు అందించే ఆర్థిక సాయంపై అపోహలు సృష్టించే ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని దావూద్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అర్హతకు ప్రాధాన్యం ఇస్తూ లబ్ధిదారులకు సహాయం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు , లబ్ధిదారులు పాల్గొన్నారు.





